ఇరుముడి మూవీ మేకర్స్‌కు కార్మిక శాఖ నోటీసులు.. మైనర్ బాలికతో షూటింగ్ వివాదం!

ఇరుముడి మూవీ: ఇరుముడి మూవీ చిత్ర యూనిట్‌కు తెలంగాణ కార్మిక శాఖ నుంచి నోటీసులు అందాయి. సినిమాలో మైనర్ బాలికను షూటింగ్ మరియు ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనేలా చేయడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు నవంబర్ 4న విచారణకు హాజరుకావాల్సిందిగా చిత్ర నిర్మాణ సంస్థను అధికారులు ఆదేశించారు.

ఇరుముడి మూవీ , న్యూస్‌ఫాస్ట్ తెలుగు: తెలుగు సినిమా ‘ఇరుముడి’ చిత్ర యూనిట్‌కు తెలంగాణ కార్మిక శాఖ నుంచి నోటీసులు అందినట్లు సమాచారం. సినిమాలో మైనర్ బాలికను షూటింగ్, ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనేలా చేయడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు, నవంబర్ 4న విచారణకు హాజరుకావాల్సిందిగా చిత్ర నిర్మాణ సంస్థను కార్మిక శాఖ ఆదేశించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

రంగారెడ్డి జోన్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో నవంబర్ 4, 2026 ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని టి. అంజయ్య కార్మిక సంక్షేమ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది.

జై లోక్‌సత్తా స్థాపక అధ్యక్షుడు చొల్లెటి మహేష్ బాబు అక్టోబర్ 8న సమర్పించిన ఫిర్యాదు ఆధారంగా కార్మిక శాఖ ఈ చర్యలు చేపట్టింది.

సినిమా షూటింగ్‌లో మైనర్ బాలికల భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి పత్రాలను సమర్పించాలని మేకర్స్‌ను అధికారులు కోరారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నుంచి తీసుకున్న అనుమతులు, ఫామ్-సి అండర్‌టేకింగ్, తల్లిదండ్రుల లేదా సంరక్షకుల రాతపూర్వక అనుమతి పత్రాలను అందజేయాలని ఆదేశించారు.

రోజువారీ పనివేళలు, కాల్ షీట్లు, అటెండెన్స్ రికార్డులను సమర్పించాలని కోరారు.

నిబంధనల ప్రకారం ఒక చిన్నారి రోజులో 5 గంటలకు మించి పనిచేయకూడదని, అలాగే ఎలాంటి విరామం లేకుండా 3 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదనే నిబంధనలు ఉన్నందున వీటిని పరిశీలించనున్నారు. బాలిక చదువుకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలతో పాటు, సంపాదనలో కనీసం 20 శాతం మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపే రికమండేషన్ పత్రాలను సమర్పించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి చిత్ర నిర్మాతలు స్వయంగా లేదా అధికారిక ప్రతినిధిని పంపాలని కార్మిక శాఖ పేర్కొంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు