కామారెడ్డి హత్య, న్యూస్‌ఫాస్ట్ తెలుగు (కామారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో ఒక మహిళ తన ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ఈ హత్యను ప్రమాదంగా నమ్మించేందుకు నిందితులు మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హన్మాజిపేట్ గ్రామానికి చెందిన దినసరి కూలీ చాకలి అలియాస్ గుమ్మడి కాశీరామ్ (26) హత్యకు గురయ్యాడు.
అక్టోబర్ 23వ తేదీ రాత్రి గ్రామ శివార్లలోని పచేర చెరువులో కాశీరామ్ శవమై తేలడంతో ఈ ఘటన వెలుగు చూసింది. కాశీరామ్ భార్య గుమ్మడి సవిత (25)కు..
అదే గ్రామానికి చెందిన దినసరి కూలీ చింతకిండి రాము (26), ట్రాక్టర్ డ్రైవర్ పసుపుల సంతోష్ (25)లతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన సవిత, తన ఇద్దరు ప్రియులతో కలిసి హత్యకు ప్లాన్ వేసింది.
పథకం ప్రకారం.. అక్టోబర్ 23న రాత్రి నలుగురూ కలిసి మద్యం తాగేందుకు వెళ్లారు.
కాశీరామ్ బాగా మద్యం సేవించి మత్తులో ఉన్న సమయంలో, సంతోష్ అతని చేతులను గట్టిగా పట్టుకోగా, రాము నైలాన్ తాడుతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని పచేర చెరువులో పడేసి, ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించేందుకు యత్నించారు.
మృతుడి తండ్రి చాకలి భూమయ్య ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో అది హత్య అని తేలడంతో పోలీసులు కేసును భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103కి మార్చారు.
సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, క్లూస్ టీమ్ విచారణ ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ 30న హన్మాజిపేట్‌లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వారు నేరాన్ని అంగీకరించడంతో.. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.
న్యాయస్థానం వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.




