Egg Trafficking Racket: హైదరాబాద్‌లో అక్రమ అండాల విక్రయాల గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్

Egg Trafficking Racket: హైదరాబాద్ నగరంలో నిరుపేద మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అక్రమ అండాల విక్రయాల హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను మల్కాజిగిరి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ దందాతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి, 49 మంది మహిళలను రక్షించినట్లు సీపీ సుమతి వెల్లడించారు.

Egg Trafficking Racket, NewzFast Telugu (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలో నిరుపేద మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అక్రమ అండాల విక్రయాల హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను మల్కాజిగిరి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర సహా పలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అమాయక యువతులను ట్రాప్ చేసి, నగరంలోని ప్రకాష్ నగర్, సరూర్‌నగర్, గోపాల్‌పురం ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంచి ఈ అక్రమ దందా సాగిస్తున్నట్లు సీపీ సుమతి వెల్లడించారు.

బాధిత మహిళలకు పదేపదే ప్రమాదకర హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తూ వారి ఆరోగ్యంతో నిందితులు చెలగాటమాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒక్కోసారి అండాల సేకరణ ద్వారా ముఠా ఏకంగా రూ.

3 లక్షలు ఆర్జిస్తుండగా, బాధిత మహిళలకు మాత్రం కేవలం రూ. 3 వేలు ఇచ్చి మోసం చేసినట్లు గుర్తించారు.

నాంపల్లికి చెందిన దుర్గాప్రసాద్, ఇండోర్ వాసి అమిత్ శర్మలతో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన నిక్కత్ పర్వీన్, రేష్మా, షేక్ పర్వీన్ అనే ఏజెంట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఈ మాఫియాను నడిపించారు. విజయ్ భగవత్ రావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తూ పలు ఫెర్టిలిటీ సెంటర్లతో అక్రమ సంబంధాలు నెరిపినట్లు పోలీసులు గుర్తించారు.

బేగంపేట, సరూర్‌నగర్ లలోని మూడు రిక్రూట్‌మెంట్ ప్రాంతాలపై రైడ్‌లు చేసిన పోలీసులు మొత్తం 49 మంది బాధిత మహిళలను సురక్షితంగా రక్షించారు. ఈ దందాతో సంబంధమున్న ప్రధాన సూత్రధారులు సహా మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

ఈ ముఠాతో హస్తమున్న ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు చేపడతామని, నకిలీ రికార్డులు తేలితే ఆసుపత్రులపై కఠిన చర్యలు ఉంటాయని సీపీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు