ఆదిలాబాద్ జిల్లా, NewzFast Telugu (ఆదిలాబాద్): ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతులను లక్ష్యంగా చేసుకుని, లీజు పేరుతో ఫైనాన్స్ ట్రాక్టర్లను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫైనాన్స్ బకాయిలు తామే చెల్లిస్తామంటూ నమ్మించి అమాయక రైతులను ఈ ముఠా మోసగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని అమరావతి కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది. జిల్లాలోని ఇంద్రవెల్లి, బేలా, ఉట్నూర్, తాంసి మండలాల్లోని రైతులను సంప్రదించి ఈ ట్రాక్టర్లను తీసుకెళ్లినట్లు విచారణలో వెల్లడైంది.
ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేల చొప్పున కమిషన్ ఆశ చూపి స్థానిక ఏజెంట్లను కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం మొత్తం 9 ట్రాక్టర్లను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలు మహారాష్ట్రలోని అమరావతి, చిక్లీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యోగేష్ పాటిల్‌తో పాటు ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరు స్థానిక ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇంకా మూడు ట్రాక్టర్ల ఆచూకీ లభించాల్సి ఉంది.
ఫైనాన్స్ బకాయిలు చెల్లిస్తామని వచ్చే అపరిచిత వ్యక్తులను నమ్మి రైతులు ఎవరూ తమ ట్రాక్టర్లను అప్పగించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మిగిలిన నిందితులు, ట్రాక్టర్ల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


