వైఎస్ జగన్ , NewzFast Telugu (పులివెందుల): వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఆయన ఆదివారం పులివెందులకు రానున్నారు.
ఆదివారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం ఆయన తిరిగి పయనం కానున్నారు.
తాజాగా తన పులివెందుల పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, పోలింగ్ రోజు తాను పులివెందులలోనే ఉంటానని, ఎవరు వస్తారో రండంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ రోజు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. జగన్ పులివెందుల నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నందున ఆయనకు ఓటు హక్కు వినియోగించుకునే పూర్తి హక్కు ఉందని తెలిపారు.
అయితే ఎన్నికల నియమావళి ప్రకారం ఆయన తన ఓటు ఉన్న పోలింగ్ కేంద్రానికి మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
జగన్ తన ఓటు వేసిన తర్వాత పులివెందుల పట్టణంలో తిరగడానికి లేదా ఇతర పోలింగ్ కేంద్రాలను సందర్శించడానికి అనుమతి లేదని డీఐజీ కోయ ప్రవీణ్ తేల్చిచెప్పారు. ఓటరుగా ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని, ఓటు వేసిన వెంటనే ఆయన నేరుగా వెళ్లిపోవాలని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ జగన్ మధ్యాహ్న సమయంలో పులివెందులకు వస్తున్నందున, అప్పటికి సగం పోలింగ్ పూర్తవుతుంది. ఓటు వేసిన తరువాత ఆయన పోలింగ్ సరళిని పరిశీలించడానికి లేదా ఇతర బూతులను సందర్శించడానికి ప్రయత్నిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇతర పోలింగ్ బూతుల వద్దకు వెళ్తే పోలీసులు అనుమతించమని చెబుతున్నారు. క్యాడర్‌కు నైతిక స్థైర్యం కల్పించేందుకు ఆయన పులివెందులలో ఉంటానని చెప్పినప్పటికీ, నిబంధనలు పాటించకపోతే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది వేచి చూడాలి.




