Vikarabad mining pit drowning, NewzFast Telugu (Dharur mandal, Vikarabad district): వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలో దారుణమైన విషాద సంఘటన చోటుచేసుకుంది. సుద్ద (సున్నపురాయి/చాక్) మైనింగ్ గుంతలో నీట మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనతో తరిగోపుల గ్రామంలో ఒక్కసారిగా శోకసంద్రం అలుముకుంది. తరిగోపుల గ్రామానికి చెందిన అశోక్, శ్రీనివాస్ మేకలు మేపేందుకు తరిగోపుల-జైదుపల్లి గ్రామాల మధ్య ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ మేకలు, గొర్రెలను కడిగేందుకు సమీపంలోని సుద్ద మైనింగ్ గుంత వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అశోక్ గొర్రెను కడిగేందుకు నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలో జారిపడ్డాడు.
అశోక్ నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన స్నేహితుడు శ్రీనివాస్ అతడిని కాపాడేందుకు వెంటనే నీటిలోకి దూకాడు. అయితే గుంత లోతు ఎక్కువగా ఉండటంతో పాటు ఊబిలా మారిన నీటి సందుల వల్ల ఇద్దరూ బయటకు రాలేక నీట మునిగి ప్రాణాలు విడిచారు.
సమాచారం అందుకున్న గ్రామస్తులు స్థానిక పోలీసులకు తెలియజేశారు. ధారూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

