వివాహేతర సంబంధం, NewzFast Telugu (కర్ణాటక, మాండ్య జిల్లా): కర్ణాటకలోని మాండ్య జిల్లా వీహెచ్ ఫార్మ్ రైల్వే గేట్ సమీపంలో ఒక వివాహిత ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
సహానా (25) ఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవర్ వీరేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. బెంగళూరులోని మదనాయకనహళ్లిలో ఈ దంపతులు నివసిస్తున్నారు.
వీరికి ఆరేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.
అదే భవనంలో ఉంటున్న రాహుల్ (23) అనే యువకుడితో సహానాకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న భర్త వీరేష్ ఆమెను నిలదీసి, రాహుల్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించాడు.
కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ ఘర్షణ తలెత్తడంతో మనస్తాపం చెందిన సహానా మాండ్యలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది.
గురువారం రాహుల్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి వీహెచ్ ఫార్మ్ రైల్వే గేట్ వద్ద వేగంగా వస్తున్న రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

