శ్రీనివాస రామానుజం, NewzFast Telugu (అమరావతి/తిరుమల): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ నియామకంపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన ప్రస్తుత బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు పదవీకాలం నవంబర్ 7 నాటికి ముగియనుండటంతో కొత్త చైర్మన్ రేసుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తుపాకి ప్రచురించిన కథనం ప్రకారం, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మికవేత్త, కేంద్ర పెద్దలతో బలమైన సంబంధాలు ఉన్న శ్రీనివాస రామానుజం (అసలు పేరు లోకాద్రి నాయుడు) పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఒకప్పుడు విదేశాల్లోను, దేశీయంగా ప్రముఖ వ్యాపారాలు చేసిన ఆయన పేరు రేసులో నిలవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి ఆయనకే అవకాశం ఇస్తారా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీనివాస రామానుజం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), కేంద్ర బీజేపీ అగ్రనాయకత్వంతో నేరుగా మాట్లాడగలిగే స్థాయిలో బలమైన సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్నజీయర్ స్వామి సమక్షంలో రామానుజ మతాన్ని స్వీకరించి పేరు మార్చుకున్న ఆయనకు పూర్తి ఆధ్యాత్మిక నేపథ్యం ఉండటంతో తిరుమల పవిత్రతను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఈయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
శ్రీనివాస రామానుజం పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు కూడా ఈ రేసులో ముందంజలో ఉన్నారు. మాజీ మంత్రి, టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుతో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే, ప్రస్తుత బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పేర్లు ప్రాంతీయ, సామాజిక సమీకరణాల పరంగా పరిశీలనలో ఉన్నాయని నివేదిక తెలిపింది.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల నూతన బోర్డు ప్రకటనపై కొంత జాప్యం జరగొచ్చునని, అప్పటివరకు తాత్కాలికంగా ‘స్పెసిఫైడ్ అథారిటీ’ని నియమించే అవకాశం ఉందని సమాచారం.

