నార్సింగి కొకైన్ నెట్‌వర్క్ అరెస్ట్, NewzFast Telugu (నార్సింగి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో భారీగా సాగుతున్న కొకైన్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను పోలీసులు చేధించారు. విలాసవంతమైన ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు.
ఈ ఆపరేషన్‌లో సైబరాబాద్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్, నార్సింగి లోకల్ పోలీసులు, ఈగల్ వింగ్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ప్రత్యేక బృందాలు నిందితుల నుంచి 107.4 గ్రాముల కొకైన్‌తో పాటు 2 ఖరీదైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి.
స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ మార్కెట్‌లో రూ.లక్షల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా ఐటీ కారిడార్ పరిధిలోని ప్రముఖులు, యువతను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు సుదీర్ఘకాలంగా డ్రగ్స్ విక్రయించగా వచ్చిన చట్టవిరుద్ధ ఆదాయంతో రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తులు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.
ఈ ఆస్తులన్నింటినీ చట్టపరంగా జప్తు చేసేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉందనే కోణంలో సమగ్ర విచారణ కొనసాగుతోంది.


