నంద్యాల అంతర్‌జిల్లా దొంగల అరెస్ట్, NewzFast Telugu (నంద్యాల): నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జయంపు మహేష్, అభిసెట్టి నాగేంద్ర అనే ఇద్దరు నిందితులు కలిసి జంటగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఏఎస్పీ సుస్మిత వెల్లడించారు.
వారి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 51 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.54 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ వివరాలను ఏఎస్పీ సుస్మిత మీడియాకు వివరించారు.
ప్రధాన నిందితుడు జయంపు మహేష్ కర్నూలుకు చెందినవాడని, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడని ఏఎస్పీ వివరించారు. అతనిపై మొత్తం 34 కేసులు ఉన్నట్లు తెలిపారు.
గతంలో పలు కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడటం అతనికి అలవాటుగా మారిందని ఆమె పేర్కొన్నారు. మరో నిందితుడు నాగేంద్రపై ఒక కేసు ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐలు ఈశ్వరయ్య, సురేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఏఎస్పీ సుస్మిత అభినందించారు.


