హైదరాబాద్ గంజాయి రాకెట్ అరెస్ట్, NewzFast Telugu (హైదరాబాద్): హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈగల్ ఫోర్స్, ఎస్టీఎఫ్ మరియు చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా సుమారు 60 రోజుల నిరంతర వేట తర్వాత ఈ నెట్‌వర్క్‌ను ఛేదించారు.
ఈ కేసులో కింగ్పిన్తో పాటు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 24.7 కిలోల గంజాయి, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసోంకు చెందిన భాస్కర్ హజారికా 2020 నుంచి ఒడిశా సరఫరాదారుల ద్వారా గంజాయిని తెప్పించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో ఫుట్‌పాత్ హోటల్ నిర్వహిస్తూ నిందితుడు ఎవరికీ అనుమానం రాకుండా ఈ నెట్‌వర్క్‌ను నడిపినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో మూడు కేసుల్లో పోలీసులకు చిక్కి బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ అతను తన అక్రమ దందాను ఆపలేదు.
నిందితులు ఒడిశా నుంచి కిలో గంజాయిని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు కొనుగోలు చేసి, దానిని 150 చిన్న ప్యాకెట్లుగా విభజించి ఒక్కో ప్యాకెట్‌ను రూ.300కు విక్రయించేవారు. గడచిన 10 నెలల్లో సుమారు 400 కిలోల గంజాయిని విక్రయించి రూ.1.8 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బ్యాంకు లావాదేవీల ద్వారా ఒక్క సరఫరాదారుడికే వివిధ విడతలుగా రూ.48 లక్షలు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. మొదట చౌటుప్పల్ పోలీసులకు చిక్కిన ఇద్దరు కొరియర్లను విచారించడంతో ఈ గ్యాంగ్ గుట్టు బయటపడింది.
ఈ సమాచారంతో ప్రత్యేక బృందాలు న్యూ హఫీజ్‌పేట్‌లోని భాస్కర్ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టయిన వారిలో భాస్కర్ హజారికాతో పాటు బాబు బోరా, నిర్మల్ హజారికా, ప్రంజల్ దత్తా, అకాన్ రాజ్‌బంశీ ఉన్నారు.
ఈ ఘటనపై సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

