ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం, NewzFast Telugu (కరీంనగర్): ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠాపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
రైల్వే, కోర్టులు, జడ్పీ తదితర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేసిన కేసులో మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దూడపాక తిరుపతిని సెప్టెంబర్ 8న అరెస్ట్ చేశారు.
తాజాగా అరెస్టయిన వారిలో జక్కుల నరసింహమూర్తి, కోలా వెంకటేశ్వర్లు, ఈట్ల సత్యం, బడుగు రాజశేఖర్, పెంట అంజయ్య ఉన్నారు. వీరిని నవంబర్ 5న అరెస్ట్ చేశారు.
నిందితులు రైల్వే టికెట్ కలెక్టర్లుగా (TC) నటిస్తూ బాధితులను రైల్వే స్టేషన్లకు తీసుకెళ్లి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. నకిలీ నియామక ఉత్తర్వులు, సర్వీస్ బుక్కులు చూపించి డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, ఒక నకిలీ సర్వీస్ బుక్, ఒక నకిలీ నియామక ఉత్తర్వు, నేరానికి ఉపయోగించిన హ్యుందాయ్ ఐ-20 కారును స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లలోని ఫోన్‌పే, పేటీఎం లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు.

