నకిలీ కరెన్సీ స్వాధీనం అబ్దుల్లాపూర్ మెట్, NewzFast Telugu (రంగారెడ్డి జిల్లా): హైదరాబాద్ నగర శివార్లలో భారీ మొత్తంలో చలామణికి సిద్ధం చేసిన నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో రూ.6.7 కోట్ల ముఖ విలువ గల నకిలీ నోట్లు బయటపడ్డాయి. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
నకిలీ కరెన్సీని రహస్యంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని సోదాలు చేయగా కోట్ల రూపాయల దొంగ నోట్లు లభ్యమయ్యాయి. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ.6.7 కోట్ల నకిలీ కరెన్సీతో పాటు వాహనాన్ని, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నకిలీ నోట్లు ఎక్కడ ముద్రించారు, వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, నోట్లను ఎవరికైనా అందజేశారా అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పండుగలు, ఎన్నికలు, వ్యాపార లావాదేవీల సమయంలో ఈ నోట్లను మార్కెట్లోకి పంపేందుకు ప్లాన్ చేశారా అనే అంశంపై నిందితులను తీవ్రంగా విచారిస్తున్నారు.


