కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ , NewzFast Telugu (జగిత్యాల): జాతీయస్థాయిలో ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీల పోటాపోటీ కార్యక్రమాలతో జగిత్యాల జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ పిలుపునిచ్చిన ఢిల్లీ నిరసనకు కాంగ్రెస్ శ్రేణులు హస్తినబాట పట్టగా, బీజేపీ మాత్రం క్షేత్రస్థాయిలో పాదయాత్రలకు సన్నద్ధమవుతోంది.
జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వివిధ మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, కార్యకర్తలు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగనున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ మహానిరసనకు తరలివెళ్లారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో ఈ తరలింపు కొనసాగుతోంది.
మరోవైపు, కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – విద్రోహులను తరిమికొడుదాం’ పేరిట నవంబరు 2 నుంచి రాష్ట్రంలో మహాపాదయాత్రలు చేపట్టనుంది. హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిర్మల్‌లో సునీల్‌బన్సల్, కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం కొంత తగ్గిన రాజకీయ ఉద్రిక్తత ఈ పరిణామాలతో మళ్లీ జోరందుకుంది.







