చౌటుప్పల్ శివసత్తు సుధాకర్ స్వామి హత్య కేసు నిందితుల అరెస్ట్, NewzFast Telugu (యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో శివసత్తు సుధాకర్ స్వామిని హత్య చేసి, అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, వెండి, నగదు, కారుతో పరారవుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన నిందితులను నిర్మల్ జిల్లా పోలీసులు ఆదివారం అర్ధరాత్రి పట్టుకున్నారు.
సోన్ మండలం గంజాల్ టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి, పోలీసు సిబ్బంది శ్రీనివాస్, సూర్యభాను, రఘు, శ్రీధర్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.4 కిలోల బంగారం, మూడు కిలోల వెండి, రూ. 9 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను యాదాద్రి జిల్లా పోలీసులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై లింబాద్రి, పోలీసు సిబ్బందిని నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల ప్రత్యేకంగా అభినందించారు.
రాళ్లబండి సుధాకర్ స్వామి హత్యకేసులో ఇద్దరు నిందితులను చౌటుప్పల్ కోర్టుకు తరలించినట్టు ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు.


