బెంగళూరు కుటుంబ నరమేధం, NewzFast Telugu (బెంగళూరు): రాజాజీనగర్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ క్యాబ్ డ్రైవర్ తన భార్య కుటుంబానికి చెందిన ఏడుగురిని వారం రోజుల వ్యవధిలో హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిని 53 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ ఇందుశేఖర్‌గా గుర్తించారు. ఆయనకు సుమారు 20 ఏళ్ల క్రితం సునీతతో వివాహమైంది.
భార్య తరచూ పుట్టింటికి వెళ్తుండటంపై గత కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
గొడవల సమయంలో భార్యకు ఆమె తల్లి, సోదరులు మద్దతుగా నిలవడంతో నిందితుడు వారిపై ఆగ్రహం పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. మొదట భార్య సునీతను హత్య చేసి మృతదేహాన్ని నంది హిల్స్ సమీపంలో పడేసినట్లు సమాచారం.
ఆ తర్వాత బావమరుదులను, వారి భార్యలను, అత్తను, ఏడేళ్ల మేనల్లుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆధారాలు తొలగించేందుకు రసాయనాలతో రక్తపు మరకలను శుభ్రం చేశాడని తెలిపారు.
ఒక మహిళ కనిపించడం లేదంటూ ఫిర్యాదు రావడంతో దర్యాప్తు ప్రారంభమైందని, సంభాషణలు, ప్రవర్తన ఆధారంగా రెండు రోజుల క్రితం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు. విచారణలో అతడు హత్యలను అంగీకరించాడని చెప్పారు.
ఈ ఘటనలో ఉపయోగించిన రోకలిబండ, మృతదేహాలను తరలించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక మృతదేహం లభ్యమైందని, మిగిలిన వాటి కోసం గాలింపు జరుగుతోందని తెలిపారు.
ఈ కేసులో నిందితుడితో పాటు కుటుంబంలోని మరొకరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

