ఏపీ స్థానిక ఎన్నికలు , NewzFast Telugu (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా పది గంటల పాటు పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈసారి ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఏకంగా 75 వేల మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటుండగా, 36,351 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.
ప్రతీ ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలలో ఆదివారం పోలింగ్ జరగనుంది. పలు ప్రాంతాల్లో స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల పారదర్శకత కోసం సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.



