ఏపీ మున్సిపల్ ఎన్నికలు, NewzFast Telugu (విజయవాడ): ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తారుమారైన ఘటన విజయవాడలో కలకలం రేపింది. నగరపాలక సంస్థ పరిధిలోని 55వ డివిజన్ ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో ఈ పొరపాటు చోటు చేసుకున్నట్లు నమస్తే తెలంగాణ వార్తా కథనం వెల్లడించింది.
బ్యాలెట్ పేపర్‌లోని వివరాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు పక్కన కాంగ్రెస్ పార్టీకి చెందిన హస్తం గుర్తు ముద్రించగా, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ఎదుట వైఎస్సార్‌సీపీకి చెందిన ఫ్యాన్ గుర్తు ముద్రించారు.
ఈ గుర్తుల తారుమారుపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చక్రవర్తికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అభ్యర్థి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న అధికారులు, ఆ డివిజన్‌లో పోలింగ్‌ను తక్షణమే నిలిపివేశారు. కొత్తగా బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసిన తర్వాతే పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం.
అయితే, అంతకుముందు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తూ ఆర్వో విడుదల చేసిన ఫారం-11లో మాత్రం గుర్తులు సక్రమంగానే ఉన్నాయని నివేదిక తెలిపింది. అధికారులు ఉద్దేశపూర్వకంగా గుర్తులు మార్చారనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఈ ఘటనతో ఓటర్లు అయోమయంలో పడ్డారు.
మరోవైపు వివిధ పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణలతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

