రేవంత్ రెడ్డి, NewzFast Telugu (న్యూఢిల్లీ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రావణాసురుడితో, కాంగ్రెస్ కార్యకర్తలను ‘వానర సైన్యం’తో పోలుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ భారీ ర్యాలీ నేపథ్యంలో దేశ రాజధానిలోని తెలంగాణ భవన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రావణాసురుడి లాంటి మోదీని ఓడించేందుకు మా వానర సైన్యం తరలివచ్చింది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా రాంలీలా మైదానం వేదికగా ఈ పోరాటం మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తూ, పేదల హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఓట్ల తొలగింపుపై తీవ్ర ఆరోపణలు
దేశంలో ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లను తొలగించారని, రాబోయే రోజుల్లో మరో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజల ఓట్లను పథకం ప్రకారమే జాబితాల నుంచి గల్లంతు చేస్తున్నారని విమర్శించారు.
మోదీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికే ఈ తరహా అక్రమాలు, కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
ర్యాలీకి జనం రాకుండా రైళ్లను సైతం నిలిపివేసినప్పటికీ, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ కలిసికట్టుగా సాగిస్తున్న పోరాటం తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


