పులివెందుల, న్యూస్ఫాస్ట్ తెలుగు (పులివెందుల): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులివెందుల మున్సిపల్ ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శనివారం ఓటువేసేందుకు హెలికాప్టర్లో పులివెందులకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, అధికార యంత్రాంగంపై నిప్పులు చెరిగారు.
బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు చేరుకున్న జగన్‌కు ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. భాకరాపురంలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్‌కు అధికారులు మొదట అనుమతి నిరాకరించడంతో హెలికాప్టర్ కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
ఆ తర్వాత అనుమతి రావడంతో భాకరాపురం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న జగన్ 14వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని మండిపడ్డారు.
మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో దాదాపు 70 చోట్ల తమ పార్టీ ఏజెంట్లను టీడీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేసి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఉదయం 4 గంటల నుంచే బూత్‌లను ఆక్రమించి దొంగ ఓట్లు వేస్తున్నారని, వైసీపీ అభ్యర్థి ప్రమీలమ్మతో పాటు పలువురు నేతలపై దాడులు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
కలెక్టర్లు, ఎస్పీలకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, పోలీసులే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని జగన్ ఆరోపించారు. పులివెందులతో పాటు జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, తాడిపత్రి, మదనపల్లెల్లో కూడా ఓటర్లను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి అక్రమాలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని, ఈ ఎన్నికలను రద్దు చేసి పారదర్శకంగా రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.


