ఇండియా కూటమి , న్యూస్ ఫాస్ట్ తెలుగు: దేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయంగా దూకుడు పెంచింది. కేంద్ర ఎన్నికల సంఘంపై తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ‘ప్రజా అభిశంసన’ పేరుతో నిర్వహించిన మాక్ పార్లమెంట్ లో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు.
దేశంలో సర్ ప్రక్రియ ద్వారా దాదాపు 13.2 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని విపక్షాలు స్పష్టం చేశాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రతి ఏడుగురిలో ఒకరి ఓటు తొలగించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఓటముల తేడా కేవలం 3 శాతంగా ఉంటే, 15 శాతం ఓటర్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని ఆయన మండిపడ్డారు.
ఈ సమావేశంలో సోనియా గాంధీతో పాటు 21 ప్రతిపక్ష పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నవంబర్ 1న భారీ మార్చ్ నిర్వహించనున్నట్లు విపక్షాలు ప్రకటించాయి.


