పేర్ని నాని , NewzFast Telugu (అమరావతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి, ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న యలహంక ప్రాపర్టీ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే షర్మిల పనిచేస్తున్నారని నాని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని, ఎన్నికల్లో చూపించుకోడానికి ఏమీ లేకపోవడంతోనే జగన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
యలహంక ఆస్తిపై షర్మిల చేస్తున్న వాదనలను పేర్ని నాని పూర్తిగా తోసిపుచ్చారు. ఆ భూమి జగన్ సతీమణి వైఎస్ భారతి తల్లి డాక్టర్ సుగుణమ్మ కుటుంబానికి చెందినదని స్పష్టం చేశారు.
సుమారు 20 ఏళ్ల క్రితం జగన్‌కు చెందిన కంపెనీ ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని గెస్ట్‌హౌస్‌లు నిర్మించిందని తెలిపారు. షర్మిల చెబుతున్న ఎంఓయూలో యలహంక ఆస్తి ప్రస్తావనే లేదని తేల్చిచెప్పారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కూడా వైఎస్ జగన్ తన సోదరి షర్మిలకు రూ.230 కోట్లు ఆర్థిక సాయం చేశారని నాని పేర్కొన్నారు. వివాహమై దశాబ్దాలు గడిచినా చెల్లెలికి ఇంత పెద్దమొత్తంలో సాయం చేసే అన్నలు ఎంతమంది ఉంటారని ప్రశ్నించారు.
షర్మిల కుమార్తె వివాహాన్ని యలహంకలో నిర్వహించడంపై భద్రతా కారణాల వల్లనే జగన్ అభ్యంతరం చెప్పారని తెలిపారు. చంద్రబాబు తన కుటుంబ ఆస్తుల పంపకాలపై స్పందించాలని, మాదాపూర్‌లోని 7 ఎకరాల ఆస్తిని నారా లోకేష్‌కు ఎలా రాసిచ్చారో చెప్పాలని నాని డిమాండ్ చేశారు.


