ఏపీకి మరో తుపాను ముప్పు: వాయుగుండంగా మారిన అల్పపీడనం

తుపాను ముప్పు: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, రాగల రోజుల్లో ఏపీ తీరానికి సమీపంలోకి చేరుకుని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తుపాను ముప్పు, న్యూస్‌ఫాస్ట్ తెలుగు (ఆంధ్రప్రదేశ్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది.

ఇది ఆదివారం సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

పశ్చిమ – వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం సోమవారం సాయంత్రం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి.

ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ప్రజలను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది.

ఈ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా అధికారిక సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు