వాతావరణ మార్పులు ఆరోగ్య అత్యవసర పరిస్థితి లాన్సెట్ నివేదిక, NewzFast Telugu: వాతావరణ మార్పులను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని ది లాన్సెట్ నివేదిక సూచించింది. ప్రభుత్వ విధానాల్లో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం పెరగాలంటే ఈ చర్య అవసరమని పేర్కొంది.
2016 నుంచి 2023 మధ్య అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది మరణించినట్లు నివేదిక వెల్లడించింది. నవంబరులో జరగనున్న కాప్-31 వాతావరణ సదస్సుకు ముందు బ్రిటన్‌కు చెందిన వైద్య పత్రిక ఈ నివేదికను ప్రచురించింది.
30 దేశాలకు చెందిన 146 మంది పరిశోధకులు ప్రపంచ ప్రజల ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని విశ్లేషించారు. 2023లో వేడి కారణంగా రికార్డు స్థాయిలో 7.10 లక్షల మంది మరణించగా, వారిలో 70 శాతానికి పైగా మరణాలకు మానవ కార్యకలాపాల వల్ల కలిగిన వాతావరణ మార్పులే కారణమని అంచనా వేశారు.
దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని పరిశోధకులు సూచించారు. ప్రతి సంక్షోభం వచ్చినప్పుడు స్పందించడం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని వారు పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం తీవ్రంగా ఉందని నివేదిక తెలిపింది.
అధిక వేడి కారణంగా కార్మికుల పని సామర్థ్యం తగ్గడంతో గత మూడేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పరిశోధకులు తెలిపారు. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏటా 27.3 లక్షల మంది మరణిస్తున్నారని కూడా నివేదిక పేర్కొంది.

