కౌమార దశలో శారీరక శ్రమ లేమి ఆరోగ్య ప్రమాదాలు, NewzFast Telugu: ఒకప్పుడు ఆటపాటలతో సందడిగా గడిచిన బాల్యం ఇప్పుడు ఇళ్లకే పరిమితమవుతోంది. కౌమార దశలోనూ శారీరక శ్రమ లేని నిశ్చల జీవనశైలికి పిల్లలు అలవాటు పడుతున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక కూడా ఇదే అంశాన్ని వెల్లడించింది. ముఖ్యంగా 11 నుంచి 17 ఏళ్ల వయసు టీనేజర్లు వ్యాయామం, శారీరక శ్రమకు క్రమంగా దూరమవుతున్నారని నివేదిక పేర్కొంది.
లాన్సెట్ గ్లోబల్ హెల్త్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, సుమారు 240 మిలియన్ల టీనేజర్లు వారంలో ఒక్క రోజు కూడా కనీసం 60 నిమిషాల శారీరక శ్రమ చేయడం లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒక టీనేజర్ ఎటువంటి శారీరక కార్యకలాపాలు లేని జీవనశైలిని గడుపుతున్నారు.
ఈ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. అబ్బాయిల్లో 22 శాతం, అమ్మాయిల్లో 28 శాతం మంది ఇలాంటి జీవనశైలిని కలిగి ఉన్నారు.
రోజువారీ వ్యాయామం చేసే టీనేజర్లు కేవలం 14 శాతం మందే ఉన్నారు. గత 15 ఏళ్లుగా ఈ పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కౌమార దశలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల భవిష్యత్తులో గుండెజబ్బులు, టైప్-2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితిని నివారించేందుకు సురక్షితమైన వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, ఆడుకోవడానికి మైదానాలు, పాఠశాలల్లో ఆటలను ప్రోత్సహించే వాతావరణం కల్పించాలని WHO సూచిస్తోంది. చిన్నతనంలోనే చురుకైన అలవాట్లను పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొంది.
కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు క్రమం తప్పకుండా శారీరక కార్యకలాపాల్లో పాల్గొనేలా చూడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

