బోడుప్పల్ జువెలరీ షాపు బంగారం చోరీ కేసు, NewzFast Telugu (బోడుప్పల్): బోడుప్పల్‌లోని జువెలరీ షాపులో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును మేడిపల్లి పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి సుమారు 4 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బోడుప్పల్ వీరారెడ్డి నగర్ ఎక్స్ రోడ్డులో ఉన్న రాందేవ్ జువెలరీ షాపునకు ఈ నెల 2వ తేదీ సాయంత్రం శ్రీపతి నగేష్ (41) అనే వ్యక్తి కస్టమర్‌గా వచ్చాడు. షాపు యజమాని దృష్టి మరల్చి బంగారు చెవి రింగులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగానే చోరీకి పాల్పడినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జలేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, డీఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, ఉప్పల్ డీసీపీ, మేడిపల్లి ఏసీపీ అభినందించారు.
జువెలరీ షాపుల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సీఐ జలేందర్ రెడ్డి సూచించారు.


