త్రిపుర బీఎస్‌ఎఫ్ జవాన్లపై స్మగ్లర్ల దాడి, NewzFast Telugu (త్రిపుర): త్రిపురలోని సిపాహిజాల జిల్లా బోక్సానగర్ పరిధిలోని ఆశా బారి సరిహద్దు ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లపై స్మగ్లర్లు కర్రలు, మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో గస్తీ కాస్తున్న భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న ఈ మూక దాడిలో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు జవాన్ల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించడమే కాకుండా, ప్రభుత్వ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.
ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడిని తీవ్రంగా ఖండించారు.
దేశాన్ని రక్షించే భద్రతా దళాలపై ఇలాంటి హింసాత్మక దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ దాడితో ఆశాబారి గ్రామ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


