హవాలా మనీలాండరింగ్ కేసు ఈడీ దర్యాప్తు, NewzFast Telugu: భారతదేశం నుంచి చట్టవిరుద్ధంగా విదేశాలకు నిధులను తరలిస్తున్న భారీ హవాలా నెట్‌వర్క్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు భగ్నం చేశారు. కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించి, నకిలీ పత్రాలు సృష్టించి సాఫ్ట్వేర్ దిగుమతుల ముసుగులో విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఆరోపణ.
ఈ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ, కోల్‌కతా సహా ఏడు నగరాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని ఎమ్వీపీ పోలీసు స్టేషన్లో ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు మేరకు వడ్డి మహేష్ తదితరులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది.
విచారణలో, నిందితులు కుమ్మక్కై నకిలీ పత్రాలను సృష్టించి, వాటిని అసలైనవిగా నమ్మించి వివిధ బ్యాంకుల ద్వారా విదేశాలకు భారీగా నగదు బదిలీలు చేసినట్లు తేలింది. వడ్డి మహేష్ తన తండ్రి, మరికొందరితో కలిసి కోల్‌కతాలో కొన్ని బోగస్ కంపెనీలను రిజిస్టర్ చేసి బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు సమాచారం.
సింగపూర్, హాంకాంగ్, చైనాలోని ఐదు కంపెనీలకు కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో రూ.569.03 కోట్లు అక్రమంగా బదిలీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే, విదేశీ కంపెనీల పేరిట నకిలీ ఇన్వాయిస్లను బ్యాంకులకు సమర్పించారే తప్ప, అసలు ఎలాంటి సాఫ్ట్వేర్ దిగుమతి కాలేదని తేలింది.
ఈ కేసులో భీమేంద్ర కుమార్ గోయల్ అనే వ్యక్తి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ ట్రాన్సిట్ డిక్లరేషన్ స్కీమ్‌ను దుర్వినియోగం చేస్తూ కాస్మెటిక్స్, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలను అక్రమంగా దేశంలోకి స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన నల్లధనాన్ని విదేశీ సరఫరాదారులకు చెల్లించేందుకు ఆయన వడ్డి మహేష్‌ను ఆశ్రయించినట్లు ఆరోపణ.
2014-17 మధ్యకాలంలో భీమేంద్ర కుమార్ గోయల్ సూచనల మేరకు వడ్డి మహేష్ తన షెల్ కంపెనీల ఖాతాల ద్వారా నిధులను స్వీకరించి విదేశాలకు మళ్లించినట్లు ఈడీ పేర్కొంది. సింగపూర్, హాంకాంగ్లలోని కంపెనీల ద్వారా ఈ నిధులు మరికొన్ని కంపెనీలకు మళ్లి, నేరసొమ్మును తెల్లగా మార్చే ప్రయత్నం జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఢిల్లీలో నకిలీ చిరునామాలతో బోగస్ ఫామ్‌లను నడిపిన వ్యక్తులు, విదేశాల్లోని కంపెనీల ద్వారా కూడా నిధులు మళ్లినట్లు ఈడీ తేల్చినట్లు సమాచారం. మొత్తంగా నేరసొమ్ము సుమారు రూ.1,500 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
సోదాల సమయంలో లెక్కల్లో చూపని రూ.47 లక్షల నగదుతో పాటు, 5,900 అమెరికన్ డాలర్లు, 2,200 యూఏఈ దిర్హామ్‌లు, 5,600 చైనీస్ యువాన్ల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేరాన్ని రుజువు చేసే కీలక పత్రాలను సీజ్ చేసి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.


