సీఎం రేవంత్ రెడ్డి, NewzFast Telugu (ఢిల్లీ): నాడు రావణుడిని ఓడించేందుకు రాముడికి వానర సైన్యం ఏ విధంగా అండగా నిలిచిందో.. నేడు మోడీ అనే రావణుడిని ఓడించేందుకు తెలంగాణ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ వానర సైన్యం కదం తొక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల సంకల్పం ముందు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తలవంచక తప్పదని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీగా తరలివెళ్లారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రాకుండా అడ్డుకున్నారనే కక్షతో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలపై ప్రధాని మోడీ కక్ష పెంచుకున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును తొలగించేందుకు జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 20 కోట్లకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీ నిరసన ర్యాలీకి కార్యకర్తలు తరలివచ్చేందుకు చివరి నిమిషం వరకు రైళ్లు కేటాయిస్తామని ఆశలు కల్పించి, చివరకు రైళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ముగ్గురూ కలిసి ప్రయత్నించినా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల సంకల్పాన్ని అడ్డుకోలేకపోయారని చెప్పారు.

