పులివెందుల రీ-పోలింగ్, NewzFast Telugu (పులివెందుల): రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల సరళిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తోందని ఆరోపించారు.
పోలింగ్ కేంద్రాలను అధికార పార్టీ గూండాలు ఆక్రమించుకుని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
పులివెందుల పట్టణంలోని 80 పోలింగ్ బూట్లకు గాను 70 కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు కట్టి ఆక్రమణలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలైన ఓటర్లకు స్లిప్పులు ఇవ్వకుండా వెనక్కి పంపుతున్నారని, వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి ప్రమీలమ్మపై భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా కౌన్సిలర్ అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి పూర్తిగా సహకరిస్తోందని జగన్ ఆరోపించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఫోన్ చేసినా స్పందన లేదని తెలిపారు.
జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, తాడిపత్రి, మదనపల్లె, కుప్పం, చిలకలూరిపేట తదితర ప్రాంతాలలోనూ ప్రజలను ఓట్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అక్రమాలు జరుగుతున్న 70 బూట్లకు చెందిన ఏజెంట్లతో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ పాటించడం లేదని, వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు లేని ఈ బూట్లలో ఎన్నికలను రద్దు చేసి తక్షణమే రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.


