వేములవాడ శ్మశానవాటికలో తల్లీకొడుకులు, NewzFast Telugu (వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక మహిళ తన అనారోగ్యంతో ఉన్న కొడుకుతో కలిసి శ్మశానవాటికలో నివసిస్తున్న దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మడిపల్లి అమృత భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆమె పెద్ద కుమారుడు ఉపాధి కోసం వేరే గ్రామానికి వెళ్లగా, చిన్న కుమారుడు రాకేష్‌తో కలిసి గత ఐదేళ్లుగా వేములవాడలో అద్దె ఇంట్లో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
సుమారు ఏడాది క్రితం రాకేష్ కాలేయ సంబంధిత వ్యాధి బారిన పడ్డాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి అమృత తన ఆస్తులన్నీ అమ్మి, దాచుకున్న సొమ్మును సుమారు రూ. 10 లక్షల వరకు వైద్యానికి ఖర్చు చేశారు.
అయినప్పటికీ రాకేష్ ఆరోగ్యం కుదుటపడలేదు.
చేతిలో డబ్బులు లేకపోవడంతో అద్దె చెల్లించలేక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో అనారోగ్యంతో ఉన్న కొడుకును తీసుకుని వేములవాడలోని ఒక శ్మశానవాటికలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ దుస్థితిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెంటనే స్పందించి, బాధితుల పరిస్థితిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాకేష్‌కు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అధికారుల సహకారంతో అమృత, రాకేష్‌లను అంబులెన్స్‌లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రాకేష్‌కు అవసరమైన చికిత్స అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు.

