వృద్ధురాలి హత్య కేసులో నిందితురాలికి డబుల్ జీవిత ఖైదు, NewzFast Telugu (నల్లగొండ జిల్లా): నల్లగొండ జిల్లాలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో ప్రధాన నిందితురాలికి నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు రెండు జీవిత ఖైదులు విధించింది. ఈ విషయాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
2019 జూలై 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కేతేపల్లి మండలం కోర్లపహాడ్ గ్రామంలోని రెగులగడ్డలో ఈ హత్య జరిగింది. బెల్ట్ షాప్ నిర్వహణకు సంబంధించిన పాత కక్షలు, మనస్పర్థల నేపథ్యంలో నిందితులు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
మృతురాలు సయ్యద్ ఆశాబీ (74) కోర్లపహాడ్ గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. ఘటన జరిగిన రోజు ఉదయం సుమారు 8 గంటలకు గ్రామానికి చెందిన సయ్యద్ జాకీర్ కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ఏ-1 ముషం అంతమ్మకు హత్య నేరం కింద సెక్షన్ 302 ప్రకారం జీవిత ఖైదు, నేరపూరిత కుట్ర కింద సెక్షన్ 120(B) ప్రకారం మరో జీవిత ఖైదు విధించారు. అదనంగా గృహ అతిక్రమణ, సాక్ష్యాల మాయానికి సంబంధించిన సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్షలు విధించి, మొత్తం రూ.20,000 జరిమానా విధించారు.
ఈ కేసులో ఏ-2 చింతల శ్రీను మరణించగా, ఏ-3 విప్పు ధనలక్ష్మి అలియాస్ ధనమ్మ అన్ని అభియోగాల నుంచి నిర్దోషిగా విడుదలైంది. దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను ఆధారంగా ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు.


