చేవెళ్ల బాలిక అసభ్య ప్రవర్తన కేసు, NewzFast Telugu (చేవెళ్ల, రంగారెడ్డి): చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలో ఒక చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నవంబర్ 4న ఉదయం చిన్నారి తల్లిదండ్రులు పనికి వెళ్లగా, చిన్నారి ఇంటి వద్ద తన తమ్ముడితో కలిసి ఉంది. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో అదే కాలనీకి చెందిన కూలి పని చేసుకునే వీరముష్టి నరేష్ (45) బొమ్మలు ఇస్తానని చెప్పి పిల్లలను తన వెంట తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు.
అనంతరం చిన్నారిని బలవంతంగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. చిన్నారి ప్రతిఘటించడంతో అదే భవనంలోని పై అంతస్తులో ఉన్న ఒక మహిళ గమనించి నిందితుడిని మందలించింది.
దీంతో అతను చిన్నారిని వదిలిపెట్టగా, పిల్లలు ఇంటికి చేరుకున్నారు.
సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారి జరిగిన విషయాన్ని వివరించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా, చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిన్నారుల భద్రత పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఒంటరిగా వదిలే పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కే నరేందర్ రెడ్డి సూచించారు.

