యోగి ఆదిత్యనాథ్ అమిత్ షా, NewzFast Telugu (ఢిల్లీ): దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీలో ఇద్దరు అగ్రనేతల మధ్య పొరపొచ్చాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైకి కలిసే ఉన్నట్లు కనిపిస్తున్నా, ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని హస్తిన వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన నేతలుగా ఈ ఇద్దరినే పరిగణిస్తారు. మోదీ-అమిత్ షా జోడీ మధ్య మంచి అవగాహన ఉందని, మోదీ-యోగి మధ్య కూడా సమన్వయం ఉందని అంటారు.
అయితే యోగి-అమిత్ షా మధ్య వాతావరణం అంత సానుకూలంగా లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోదీ తర్వాత ప్రధాని పీఠాన్ని అధిరోహించగల వారసులుగా ఈ ఇద్దరి పేర్లే వినిపిస్తుండటంతో, ఆ రేసులోనే పరోక్ష పోటీ నడుస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కొద్ది రోజుల క్రితం సర్ ప్రక్రియపై యోగి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఉత్తర ప్రదేశ్‌లో సర్ కారణంగా 1.27 కోట్ల హిందువుల ఓట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడమే కాకుండా విపక్షాలకు ఆయుధంగా మారాయి.
యోగి వ్యాఖ్యలపై అమిత్ షా అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్ ప్రక్రియలో ఓట్లు గల్లంతు కావడం లేదని ప్రధానితో పాటు తాను పదేపదే చెబుతున్న నేపథ్యంలో, ఓట్ల గల్లంతుపై విపక్షాల ఆరోపణలకు ఊతమిచ్చేలా యోగి మాట్లాడటం పట్ల షా సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు.
అయితే పైకి మాత్రం ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకుంటూనే ఉన్నారు. యోగి అద్భుతమైన పాలకుడని షా కొనియాడగా, షా నేతృత్వంలో దేశంలో లా అండ్ ఆర్డర్ బాగుందని యోగి అంటున్నారు.
అయినప్పటికీ ఇద్దరి మధ్య కనిపిస్తున్న పరిణామాలు అంతర్గత పోరుకు సంకేతాలేనా అన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.




