యాసంగి వరి సాగు, NewzFast Telugu (మహబూబాబాద్ జిల్లా, గూడూరు): ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలు, ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ వ్యవసాయంలో పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
మంగళవారం గూడూరు మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. భూపతిపేట రైతు వేదికలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన, కూరగాయలు, ఆయిల్‌పామ్, మల్బరీ పంటల సాగు, వాటిలో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటలను అవసరానికి మించి సాగు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
వరి సాగు కారణంగా విద్యుత్ వినియోగం అధికమవుతుందని, ప్రభుత్వం ఒక్క ఎకరానికి రూ.50 వేలకుపైగా విద్యుత్‌పై ఖర్చు చేస్తోందని ఆమె తెలిపారు. భూగర్భ జలాలు తగ్గిపోతుండటం, జలవిద్యుత్ ఉత్పత్తి లేకపోవడం, విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడం వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు.
మిషన్ వైవిధ్యం ద్వారా రైతులు, స్వయం సహాయక సంఘాలు సమన్వయంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలు, పండ్లు, పూలు, నూనె గింజలు, ఆయిల్‌పామ్, అపరాలు, మల్బరీ, మునగ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. సదస్సు అనంతరం కలెక్టర్ క్షేత్రస్థాయిలో రైతులు సాగు చేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించారు.
మహిళా రైతు సునిత, వెంకట్ రెడ్డి గత 15 ఏళ్లుగా ఉద్యాన శాఖ ద్వారా పందిరి సాగు, మల్చింగ్, బిందు సేద్యానికి రాయితీలు పొందుతూ బీర, కీర, దోస, టమాట తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. ఎకరానికి రెండు పంటల ద్వారా రూ.2 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు వివరించారు.
రైతుల కృషిని కలెక్టర్ అభినందించారు.
అనంతరం భీముని జలపాతాన్ని సందర్శించిన కలెక్టర్ అటవీ, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ అధికారులతో వివిధ అభివృద్ధి పనులు, భూ సమస్యలపై చర్చించారు. మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి చేయూత పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.




