యాసంగి సాగు, NewzFast Telugu (హైదరాబాద్, తెలంగాణ): రాష్ట్రంలో యాసంగి సాగు విషయంలో వ్యవసాయ శాఖ ఆచితూచి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎల్నినో కారణంగా నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తోంది.
సాగునీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని యాసంగి ప్రణాళికలు తయారు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), మండల వ్యవసాయ అధికారుల (ఏవో)తోపాటు డివిజన్, జిల్లా స్థాయి అధికారులకు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
మూడు వేర్వేరు క్యాటగిరీల్లో సాగు చేయడానికి పలు రకాల పంటలను సూచించారు.
మొదటి కేటగిరీలో తక్కువ నీటితో సాగు చేసే పంటలుగా శనగ, జొన్న, కుసుమ, పెసర, మినుము, సజ్జ వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. యాసంగిలో జొన్న సాధారణ విస్తీర్ణం 2.56 లక్షల ఎకరాలు కాగా, నిరుడు 4 లక్షల ఎకరాలకుపైగా సాగు చేశారు.
ఈసారి దీన్ని 5 నుంచి 6 లక్షల ఎకరాలకు పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
శనగ సాధారణ విస్తీర్ణం 2.76 లక్షల ఎకరాలు కాగా, నిరుడు ఆ స్థాయిని కూడా దాటలేదు. సజ్జ సాధారణ విస్తీర్ణం 11 వేల ఎకరాలు కాగా, నిరుడు 8 వేల ఎకరాలకు మించలేదు.
మినుము 53 వేల ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా, నిరుడు 36 వేల ఎకరాల్లోనే సాగైంది; దీన్ని లక్ష ఎకరాలు దాటించాలనే లక్ష్యం పెట్టుకున్నారు.
రెండో కేటగిరీలో మధ్యస్థ నీటి వనరులతో సాగు చేసే పంటలుగా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు వంటి పంటలను రైతులు సాగు చేయాలని పేర్కొన్నారు. ఇందులో ప్రధాన పంట మొక్కజొన్న; సాధారణ విస్తీర్ణం సుమారు 9 లక్షల ఎకరాలు కాగా, నిరుడు రికార్డు స్థాయిలో 16.75 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.
పొద్దుతిరుగుడు సాధారణ విస్తీర్ణం 27 వేల ఎకరాలు కాగా, నిరుడు 28 వేల ఎకరాలు దాటింది. వేరుశనగ 2.37 లక్షల ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా, నిరుడు 1.61 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది.
మూడో కేటగిరీలో పుష్కలమైన నీటి వసతి, మార్కెట్ సౌకర్యం ఉన్న ప్రాంతాలను, రైతులను చేర్చారు. నీటి లభ్యత ఎక్కువ ఉన్నప్పటికీ రైతులు కూరగాయలు మాత్రమే సాగు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతున్నందున వీటి సాగును పెంచాలని అధికారులు సూచించారు.




