మహిళలు ఆర్థిక చోదక శక్తులు, NewzFast Telugu (విశాఖపట్నం): మహిళలే భవిష్యత్ గ్లోబల్ ఆర్థిక చోదక శక్తులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు మరింతగా రావాలని ఆయన పిలుపునిచ్చారు.
వచ్చే సీఐఐ సదస్సులో 50 శాతం మహిళల భాగస్వామ్యం ఉండాలని ఆయన అన్నారు. మహిళల రాజకీయ సాధికారతతో పాటు ఆర్థిక సాధికారతకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతం మించినప్పుడే తనకు సంతృప్తి అని చెప్పారు.
విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ‘ది ఉమెన్ హూ విల్ షేప్ ది నెక్ట్స్ ఎకానమీ’ థీమ్‌తో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, సీఐఐ అలియన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుచిత్రా ఎల్లా, పారిశ్రామికవేత్తలు, మహిళా నాయకులు హాజరయ్యారు.
అవకాశం ఇస్తే మహిళలు గొప్ప విజయాలు సాధిస్తారని సీఎం అన్నారు. రాష్ట్రంలో 1.13 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల సభ్యులుగా ఉన్నారని, వారు తీసుకున్న రుణాల్లో 99.6 శాతం రీపేమెంట్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
స్వయం సహాయక సంఘాల వద్ద రూ. 30,000 కోట్ల కార్పస్ ఫండ్ ఉందని, దాదాపు రూ.లక్ష కోట్ల టర్నోవర్ జరుగుతోందని చెప్పారు.
స్వయం ఏపీ బ్రాండ్ ద్వారా డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినట్టు తెలిపారు.
స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలు ఉండటం సంతోషకరమని, విశాఖ మేయర్ కూడా మహిళేనని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం కల్పించామని చెప్పారు.
రాజకీయ పార్టీలన్నీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. ఇటీవల విశాఖ, విజయవాడ, మంగళగిరిలో రూ.50,000 కోట్ల విలువైన 60,000 ఇళ్ల పట్టాలు మహిళల పేరిట ఇచ్చామని తెలిపారు.
ప్రస్తుతం ఏపీలో 35.8 శాతం మహిళా శ్రామిక శక్తి ఉందని, దీనిని త్వరలో 50 శాతానికి తీసుకువెళ్తామని సీఎం చెప్పారు. విశాఖ బ్రాండెక్స్ దుస్తుల తయారీ కేంద్రంలో 20,000 మంది మహిళలు పనిచేస్తున్నారని, గ్లోబల్ టాయ్ పార్క్‌లో 30,000 ఉద్యోగాలు మహిళల కోసం ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టుల్లో అధికంగా మహిళలకే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో కూడా మహిళలు అద్భుతాలు చేస్తున్నారని, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
డేటా సెంటర్లు, క్వాంటమ్, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో అద్భుతమైన పురోగతి ఉందని, తిరుపతిలో సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. మహిళలు సాంకేతికతపై దృష్టి పెట్టాలని సూచించారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ఎక్కువ రాయితీలు అందిస్తున్నామని, దావోస్ సమ్మిట్‌కు ఏపీ నుంచి ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలు హాజరయ్యేలా సహకరిస్తామని చెప్పారు.
మహిళల కోసం ప్రత్యేకంగా టెక్ పార్క్ ఏర్పాటు చేసి, వారికి ఉచితంగా భూమి, ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.




