వాటర్ రెగ్యులేటరీ కమిషన్, NewzFast Telugu (అమరావతి): రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తరహాలోనే వాటర్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీడబ్ల్యూఆర్సీ) ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలన్నిటికీ సౌర విద్యుత్ సరఫరా చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాలన్నీ పనిచేయాల్సిందేనని, వీటిని జలహారతి కార్పొరేషన్ పర్యవేక్షించాలని తెలిపారు. బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక సీఎస్ శశిభూషణ్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రూ.632 కోట్లతో 789 ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఏపీఎస్ఐడీసీ, జల వనరుల శాఖకు చెందిన 4,171 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 903 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆర్థిక, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 36 ప్రాధాన్య ప్రాజెక్టులకు నిధుల కొరత రానివ్వనని, వీటిని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని చెప్పారు.
పోర్టులు, విద్యుత్ రంగాల్లో మాదిరిగానే సాగునీటి రంగంలోనూ నియంత్రణ వ్యవస్థ తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. గంగా-కావేరి అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా రవాణా, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు నీటి వనరులను అందుబాటులోకి తీసుకురావచ్చని, ఆయా రంగాలకు నీటి వినియోగంపై రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా నిర్వీర్యమైన ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, వచ్చే జూన్ నాటికి వాటి ద్వారా నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖరీఫ్ కల్లా 789 ఎత్తిపోతల పథకాల మరమ్మతులను పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో స్థితిగతులను పరిశీలించి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
ఈ పథకాల పునరుద్ధరణకు రూ.632.07 కోట్లు అవసరమని అధికారులు వివరించారు. వీటి ద్వారా 7.49 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు.
నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ ఏర్పాటు చేసి, పర్యవేక్షణ బాధ్యతను జలహారతి కార్పొరేషన్ చేపట్టాలని, అందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే ప్రతి జిల్లాకు చీఫ్ ఇంజనీర్ లేదా ఎస్ఈని నియమించాలని సూచించారు.
జలవనరుల శాఖ పరిధిలో అందుబాటులో ఉన్న 5,565 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 4,061 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 877.3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని, ఏపీఎస్ఐడీసీ పరిధిలోని మరో 110 ఎకరాల ద్వారా 25.8 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉందని వివరించారు.
మొత్తంగా 903.1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు.
కాలువలపై సౌర విద్యుత్, జలవిద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని, మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా ఆదాయం పొందడాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రవాణా, విద్యుదుత్పత్తి, సౌర విద్యుత్, వ్యవసాయ రంగాలను అనుసంధానిస్తే సంపద సృష్టికి వీలుంటుందని ఆయన అన్నారు.




