వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, NewzFast Telugu (తెలంగాణ): త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించాలని కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ సర్వోత్తమ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్నికల సన్నద్ధతపై సర్వోత్తమ్ రెడ్డి వివరించారు.
ఎన్నికల్లో పార్టీ తరఫున పూర్తి సహకారం అందించాలని, ప్రచారంలో పాల్గొనాలని ఆయన మధుయాష్కి గౌడ్‌ను కోరారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు పట్టభద్రులు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అంశంపై ఇరువురు నేతలు చర్చించారు.
ఎల్బీనగర్ పరిధిలోని పట్టభద్రుల ఓటర్ల నమోదుకు, ఎన్నికల కార్యక్రమాలకు పూర్తి సహకారం ఉంటుందని మధుయాష్కి గౌడ్ హామీ ఇచ్చారు. అలాగే వనస్థలిపురంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు వినియోగించుకోవచ్చని సూచించారు.
