ఓటు హక్కు తిరిగి దరఖాస్తు, NewzFast Telugu (హైదరాబాద్, తెలంగాణ): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం ఫలించిందని మల్కాజిగిరి నియోజకవర్గం ఇంచార్జి లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆనంద్‌బాగ్‌లోని మైనంపల్లి హన్మంతరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ఓటు హక్కు కోల్పోయిన అర్హులైన ప్రజలకు మరో అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తులకు ఎన్నికల కమిషన్ స్పందించిందని ఆయన చెప్పారు. ఈ నెల 21వ తేదీ వరకు అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ ప్రజల మద్దతుతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసిందని ఆయన అన్నారు.
ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తదితరులు ఉద్యమించారని తెలిపారు.
ఇటీవల దాదాపు 100 కార్లలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్ దృష్టికి ఓటర్ల సమస్యలను తీసుకెళ్లారని చెప్పారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, వలస వచ్చిన వారు, ఓటు హక్కు కోల్పోయిన వారు తిరిగి ఓటు హక్కును పొందేందుకు గతంలో తమ ఓటరు గుర్తింపు కార్డు నంబరును నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు నమోదై ఉన్నాయనే కారణంతో హక్కు కోల్పోయిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు నిర్ణీత దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి, అవసరమైన గుర్తింపు మరియు నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని, లేకపోతే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఒక్క ఓటరు కూడా తమ హక్కును కోల్పోకూడదన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.




