Visakhapatnam Agency ZPTC MPTC election material distribution, NewzFast Telugu (పాడేరు): జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు మండలాల వారీగా సిద్ధం చేశారు.
ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాల ఆధారంగా బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని ఒక బ్యాగులో పెట్టి పంపిణీ కేంద్రాల్లో ఉంచారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికల సిబ్బందికి సామగ్రి అందించనున్నారు.
సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా చేపట్టేలా మండల రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 617 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో మొత్తం 4,98,467 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 4,69,033, ఎస్సీ ఓటర్లు 28,78, బీసీ ఓటర్లు 21,168, ఇతర ఓటర్లు 5,388 మంది ఉన్నారు.

