విజయసాయి రెడ్డి, NewzFast Telugu (విజయవాడ): వైసీపీ తాను ఓ భాగస్వామినేనని, ఇటుక ఇటుక పేర్చి కష్టపడ్డానని పరివర్తన రాజనీతి పార్టీ చీఫ్ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ విజయవాడలో తన రాజకీయ పార్టీని ప్రకటించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతిలోనూ లేదని, సమాజంలో మార్పు ప్రజల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. మంచి పనులను మనస్ఫూర్తిగా అభినందించాలని, తప్పు ఎవరు చేసినా ఆధారాలతో ప్రశ్నించాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రశ్నించడం ప్రజల ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును ఎవరూ విస్మరించవద్దని పిలుపునిచ్చారు.
యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా తమ ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) ముందుకు సాగుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని కేవలం రెండు కుటుంబాలే ఏలాలా, ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆ కుటుంబాలే శాసించాలా అని ఆయన ప్రశ్నించారు.
సీఎం కొడుకే మళ్లీ సీఎం కావాలా, సాధారణ ప్రజలు, ప్రతిభ కలిగిన యువత నుంచి కొత్త నాయకులు రావొద్దా అని నిలదీశారు.
వైసీపీ ప్రాథమిక నిర్మాణంపై స్పందిస్తూ, తాను ఆ పార్టీ నిర్మాణంలో ఒక భాగస్వామినని, రాత్రింబవళ్లు కష్టపడ్డానని గుర్తుచేశారు. ఆ కష్టంతోనే తాను ఎంపీని అయ్యానని చెప్పారు.
విధేయత అంటే బానిసత్వం కాదని, నాయకుడి ప్రతి తప్పును సమర్థించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో అధికారంలో ఉన్న పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయిందో ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. వారసత్వంగా పదవులు రాకూడదని, శక్తిసామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు ఉన్నవారే ప్రజా నాయకులుగా ఎదగాలని తమ అభిమతమని తెలిపారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపైనా విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, అక్రమ కేసులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ఆయన కొత్త పార్టీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.




