విజయసాయిరెడ్డి కొత్త పార్టీ, NewzFast Telugu (విజయవాడ): 11వ నెల, 11వ తేదీ, 11 గంటల 11 నిమిషాల ముహూర్తంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ ఆవిర్భావానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ముహూర్తం నిర్ణయించుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆయన తన కొత్త పార్టీని ప్రకటించనున్నారు.
రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా వస్తున్నట్టు ఇదివరకే చెప్పిన విజయసాయిరెడ్డి, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇప్పటికే కొందరు నేతలు ఆయన పార్టీవైపు చూస్తుండటంతో ఏపీ రాజకీయాలు ఎలా మారతాయనే ఆసక్తి నెలకొంది.
రాయలసీమ పౌరుషాన్ని నిలబెట్టేందుకు పార్టీని స్థాపించబోతున్నట్టు గతంలో తెలిపిన ఆయన, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు, కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలుకుతామని చెప్పారు. అందుకోసం యువతకు పెద్దపీట వేస్తామన్నారు.
కుల, మత రాజకీయాలను తిరస్కరించేలా చూస్తామని ఆయన ట్వీట్ చేశారు.
కరువు, కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామని, ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరు అందిస్తామని, ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. చదువుల భారాన్ని తగ్గించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయం పెంచుతామని చెప్పారు.
జెన్ జీలను నాయకులుగా తీర్చిదిద్దే పనిలో ఉన్నట్టు కూడా ఆయన తెలిపారు.
కొత్త పార్టీలోకి వలసలు ఇప్పటికే మొదలైనట్టు కనిపిస్తోంది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నపరెడ్డి విజయభాస్కర్ కొత్త పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టికెట్లు దక్కని కొందరు అసంతృప్తి అభ్యర్థులు కూడా ఈ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ వరుసలో విశాఖపట్నానికి చెందిన పీతల మూర్తియాదవ్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.




