వందే భారత్ ఎక్స్‌ప్రెస్, NewzFast Telugu (బెంగళూరు, కర్ణాటక): వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ రైళ్లుగా గుర్తింపు పొందాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఈ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.
ప్రస్తుతం రైల్వేశాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను దశలవారీగా ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి.
అయితే ఇప్పుడు రానున్న ఒక వందే భారత్ రైలు, వేగంగా కాకుండా దేశంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలుగా నిలవనుంది.
ఈ రైలును నవంబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. బెంగళూరు-మడ్గావ్ వందే భారత్ రైలు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 06512 నంబర్ గల ఈ రైలు ప్రారంభ రోజున బెంగళూరులో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు మంగళూరుకు చేరుకుంటుంది.
తర్వాతి రోజు ఉదయం 2.55 గంటలకు మడ్గావ్‌కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 06213 నంబర్ గల రైలు మధ్యాహ్నం 1.30 గంటలకు మడ్గావ్ నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ రైల్లో మొత్తం 16 చైర్ కార్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం మడ్గావ్-బెంగళూరు మధ్య ప్రయాణానికి 13 గంటల 20 నిమిషాలు పడుతుంది.
గురువారాలు మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందించనుంది. నిర్వహణ కోసం ఒక రోజు సర్వీసును నిలిపివేయనున్నారు.
ఈ రైలు కేవలం గంటకు 55 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణించనుంది. అంటే సాధారణ ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలోనే వేగం ఉండనుంది.
ఈ రైలు అందమైన పశ్చిమ కనుమల గుండా ప్రయాణిస్తుంది. సకలేష్‌పూర్, సుబ్రహ్మణ్య రోడ్ మధ్య ఘాట్ విభాగంలో సుందరమైన ప్రాంతాల గుండా సాగుతుంది.
ప్రకృతిని ఆస్వాదించాలనుకునే ప్రయాణికులకు ఇది మంచి అనుభూతిని అందించనుంది.
అధికారుల ప్రకారం, ఈ రైలు కర్ణాటక మరియు గోవా మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచనుంది. కుక్కె సుబ్రహ్మణ్య, ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ వంటి ప్రాంతాల గుండా ఇది వెళ్లనుంది.
శ్రావణబెళగొళ, హాసన్, మంగళూరు జంక్షన్, ఉడుపి, కుందాపూర్, కార్వార్ వంటి స్టేషన్లలో ఆగనుంది. ట్రాక్ సామర్థ్యం వంటి కారణాల వల్ల ఈ మార్గంలో రైలు తక్కువ వేగంతో నడవనుంది.




