ఉత్తర భారత వాయు కాలుష్యం, NewzFast Telugu (ఢిల్లీ): ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి పండుగ ముగిసిన రెండు రోజుల తర్వాత కూడా ఉత్తరాదిలోని అత్యధిక ప్రాంతాలను దట్టమైన పొగమంచు (స్మాగ్) కమ్మేసింది.
అంతరిక్షం నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ కాలుష్య మేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నాసా వరల్డ్‌వ్యూ తాజా చిత్రాల ద్వారా వెల్లడైంది. నాసా విడుదల చేసిన నవంబర్ 10 చిత్రాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వాటి సమీప రాష్ట్రాల్లో ఈ పొగమంచు ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది.
ఇది మైదాన ప్రాంతాలకే పరిమితం కాకుండా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల వరకు విస్తరించింది. మధ్య, దక్షిణ భారతదేశంలోనూ దీని ప్రభావం కొంతమేర కనిపించినప్పటికీ, తీవ్రత తక్కువగానే ఉంది.
రాజస్థాన్, గుజరాత్ వంటి పశ్చిమ రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణం చాలావరకు నిర్మలంగా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
దీపావళి నాటి నుంచి దేశంలోని వాయు పరిస్థితులను పరిశీలిస్తే గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. నవంబర్ 8న పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడంతో ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లతో పాటు ఇతర ఉత్తరాది ప్రాంతాలను దట్టమైన పొగ కప్పేసింది.
నవంబర్ 9 నాటికి ఈ పొగ కొంత పలుచబడి పలు ఉత్తరాది రాష్ట్రాలు, బీహార్, పర్వత ప్రాంతాల మీదుగా విస్తరించింది. నవంబర్ 10 నాటికి ఇది మరింత విస్తృతమై, దేశంలోని విశాల భూభాగాన్ని దట్టమైన బూడిద రంగు దుప్పటిలా కప్పేసినట్లు నమోదైంది.
శీతాకాలం ప్రారంభం కావడం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కాలుష్య కారకాలు వాతావరణంలో నిలిచిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.




