పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): రాష్ట్రంలో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించని 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు తాజాగా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది.
123 పట్టణ స్థానిక సంస్థలకుగాను ఇటీవల 100 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. కోర్టు వివాదాలు తేలడంతో మిగిలిన 23 స్థానిక సంస్థలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ యోచిస్తున్నట్లు సమాచారం.
శుక్రవారం (13న) నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.
మొదటి దశ పంచాయతీ ఎన్నికలు కూడా 26నే జరగనున్నాయి. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, పొదిలి, కందుకూరు, కావలి, అల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట మున్సిపాలిటీల్లో ఆ రోజు పోలింగ్ జరుగనుంది.
ఈ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. కార్పొరేషన్లలో శ్రీకాకుళం జనరల్ (మహిళ), రాజమహేంద్రవరం ఎస్సీ (జనరల్), కాకినాడ బీసీ (మహిళ), మంగళగిరి-తాడేపల్లి ఎస్టీ (జనరల్) స్థానాలుగా కేటాయించారు.
మున్సిపాలిటీలలో ఆమదాలవలస జనరల్ (మహిళ), రాజాం బీసీ (మహిళ), భీమవరం జనరల్ (మహిళ), తాడేపల్లిగూడెం, తణుకు జనరల్ (అన్రిజర్వ్డ్), పాలకొల్లు బీసీ (మహిళ), చింతలపూడి ఎస్సీ (మహిళ), గుడివాడ బీసీ (మహిళ), తాడిగడప బీసీ (జనరల్), పొన్నూరు జనరల్ (మహిళ), బాపట్ల ఎస్సీ (జనరల్), నరసరావుపేట జనరల్ (అన్రిజర్వ్డ్), పొదిలి ఎస్సీ (జనరల్), కందుకూరు జనరల్ (అన్రిజర్వ్డ్), కావలి జనరల్ (అన్రిజర్వ్డ్), అల్లూరు ఎస్టీ (జనరల్), గూడూరు ఎస్టీ (మహిళ), శ్రీకాళహస్తి బీసీ (జనరల్), బి.కొత్తకోట బీసీ (మహిళ) స్థానాలుగా ఖరారయ్యాయి.




