పసుపు ధర, NewzFast Telugu (ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా): మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో పసుపు ధర రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ.33,800 పలికింది. ఈ పరిణామం పసుపు రైతులకు శుభసూచకమని నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ ధరల పెరుగుదలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ చేస్తున్న నిరంతర కృషే కారణమని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడం, APEDA ఆధ్వర్యంలో మార్కెట్ లింకేజ్ కార్యక్రమాలు నిర్వహించడం, స్పైసెస్ బోర్డు ద్వారా రైతులకు అవగాహన కల్పించడం వంటి చర్యల వల్ల మార్కెట్‌లో ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
రైతులు పురుగు మందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతులు, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (IPM) విధానంలో పసుపును సాగు చేస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ మరింత పెరుగుతుందని, భవిష్యత్తులో పసుపు నిజమైన బంగారంగా మారుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించినట్లు ఆయన వివరించారు.
పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎంపీ అర్వింద్‌కు పసుపు రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




