టీఎస్పీఎస్సీ, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, అవగాహన లేని వ్యక్తులను బోర్డులో నియమించడం వల్లే నియామక ప్రక్రియలో గందరగోళం ఏర్పడిందని ఆయన విమర్శించారు.
తాను బాధ్యతలు స్వీకరించాక కమిషన్ను ప్రక్షాళన చేసి అనుభవం, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులను బోర్డులో నియమించామని సీఎం తెలిపారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, భద్రతా సలహాదారు శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్-1 నియామకాల ప్రక్రియలో జరిగిన పరిణామాలను కూడా సీఎం వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్-1 నియామకాలు జరిగాయని, ఆ తర్వాత దాదాపు 13 ఏళ్ల పాటు నియామక ప్రక్రియ ముందుకు సాగలేదని ఆయన గుర్తుచేశారు.
గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు, ప్రవేశ పరీక్షల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని, ఆనాటి నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది అభ్యర్థులు నష్టపోయారని పేర్కొన్నారు.
563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 562 మంది ఉద్యోగాల్లో చేరారని సీఎం వెల్లడించారు. అయితే ఈ నియామక ప్రక్రియపై కొందరు ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించారని ఆయన ఆరోపించారు.
తాము చేయని తప్పులను తమకు ఆపాదిస్తూ నియామకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, దీనివల్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు.
ఈ అంశంపై న్యాయస్థానాల్లో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించిందని, సుప్రీంకోర్టు సైతం నియామక ప్రక్రియను సమర్థించిందని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగాలు సాధించిన యువ అధికారులు తమ నేపథ్యాన్ని, ఏ లక్ష్యంతో ఈ స్థాయికి చేరుకున్నారో మర్చిపోవద్దని ఆయన సూచించారు.
డీఎస్పీగా ఉద్యోగ సాధనతో జీవితంలో రెండో అధ్యాయం ప్రారంభమవుతుందని అన్నారు.
అధికారం ప్రజల కోసం వినియోగిస్తేనే ఎక్కువ కాలం గౌరవం నిలుస్తుందని, స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ఆ అధికారం ఎక్కువ కాలం ఉండదని సీఎం హితవు పలికారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఓపికగా వినాలని, బాధితుల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ భవిష్యత్తు యువ అధికారుల చేతుల్లోనే ఉందని, విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించే బాధ్యత వారిపై ఉందని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణలో ప్రతిభ కనబరిచిన ట్రైనీ డీఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ అందజేశారు.




