ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు తెలంగాణ పోలీసు శిక్షణ, NewzFast Telugu (హైదరాబాద్): పోలీస్ శాఖలో చేరి ప్రజలకు సేవలందించాలనుకుంటున్న ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ పోలీసు శాఖ మద్దతు ప్రకటించింది. “ప్రతి ఒకరికి సాధికారత-ఎవరిని విస్మరించవద్దు” అనే నినాదంతో ప్రత్యేక సాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మహిళా భద్రత మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగాలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో 20 మంది ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఈ అభ్యర్థులు కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం వారికి భారత చరిత్ర, తెలంగాణ చరిత్ర, అంకగణితం, రీజనింగ్, భూగోళశాస్త్రం, తాజా వ్యవహారాలు మరియు ఆర్థిక శాస్త్రం పుస్తకాలు అందజేశారు.
కోచింగ్ మరియు హాస్టల్ ఖర్చుల కోసం సాధికారత శాఖ 3.50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిందని కమిషనర్ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని యూనిక్ కోచింగ్ సెంటర్ మరియు కల్పన హాస్టల్ నిర్వాహకులతో కలిసి ఈ సౌకర్యాలు కల్పించారు.
అభ్యర్థుల కోచింగ్ పురోగతిని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని సీపీ పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొందరు ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పోలీసు శాఖలోకి అడుగుపెట్టాలని అభ్యర్థులకు సీపీ సుమతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాధికారత శాఖ సమన్వయకర్త సునంద, మహిళా భద్రత విభాగం డీసీపీ ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు.
