తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు, NewzFast Telugu: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. శనివారం, ఆదివారాలు సెలవులు కావడంతో రద్దీ మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
గురువారం ఒక్కరోజే 65,218 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 20,213 మంది తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.64 కోట్లుగా నమోదైంది.
మరోవైపు, ఈ నెల 20 నుంచి 29 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే లక్ష్యమని ఆదేశించారు.
సమీక్షలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, తొలి మూడు రోజులు (డిసెంబర్ 20-22) ఆన్లైన్ ఈ-డిప్ విధానంలో ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించనున్నారు. మిగిలిన ఏడు రోజులు (డిసెంబర్ 23-29) సర్వదర్శనం భక్తులకు అనుమతిస్తారు.
డిసెంబర్ 25న అభిషేక సేవ సమయంలో కూడా సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.


